నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

-

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నెల 8వ తేదీ నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.  హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.

దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను, ఇతర ప్రముఖులను ఈ సందర్భంగా సీఎం సన్మానించనున్నారు. సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్‌ మహదేవన్‌ గాత్రకచేరి, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సి బ్రదర్స్‌ ఖవ్వాళీ, స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘువీడియో ప్రదర్శన ఉంటుంది. లేజర్‌ షోతో పాటు భారీఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.

రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, ట్రస్టు బోర్డుల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు అన్ని జిల్లాల నుంచి 30వేల మంది ప్రజలు హాజరుకానున్నారు. ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version