దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ప్రధాని అన్నారు.. 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదని, ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో బతకాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేకిన్ ఇండియాలో భారత్ దూసుకెళ్తోందని, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మనదేశంలోనే తయారవుతున్నాయన్నారు మోడీ. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదని, ప్రపంచ అవసరాల్ని తీర్చే సత్తా భారత్‌కు ఉందని ఆయన ఉద్ఘాటించారు.
స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు. ప్రపంచ యవనికపై తనదైన ముద్రవేసిందని, సమస్యలకు ఎదురొడ్డి నిలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిందని చెప్పారు.