ఇంగ్లండ్‌తో నాటింగామ్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు భారత్ విజయం సాధించేందుకు 157 పరుగులు మాత్రమే అవసరం ఉండగా.. మ్యాచ్‌కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఏ దశలోనూ తెరిపి ఇవ్వలేదు. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
చివరి రోజు కేవలం 157 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో కూడా ఉన్నారు. లంచ్ సెషన్ తరువాత ఆట ముగుస్తుందని కూడా అంచనా వేశారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. వరుణుడు అడ్డంకిగా మారడంతో మ్యాచ్ అస్సలు జరగలేదు. ఈ క్రమంలో మ్యాచ్‌ను డ్రాగా ముగించక తప్పలేదు.
కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేపట్టగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 183 పరుగులకే ఆలౌట్ అయింది. తరువాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అవగా, అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 303 పరుగులు చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే 5వ రోజు భారత్ లక్ష్యాన్ని ఛేదించి టెస్టులో గెలుస్తుందని అనుకున్నారు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 12వ తేదీ నుంచి లార్డ్స్ మైదానంలో జరగనుంది.