ఇకపై ఆన్‌లైన్లోనే ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ వాల్యుయేషన్ కూడా మ్యాథ్స్‌కు సులభంగానే ఉంటుంది. కానీ, మిగిలిన వాటిని కచ్చితంగా ఫిజికల్‌గా దిద్దాల్సిందేనని అంటున్నారు. కోవిడ్ వైరస్ అండ్ లాక్‌డౌన్ మన రెగ్యులర్ జీవితాన్ని మార్చేసింది. స్కూల్, కాలేజీలు, ఆఫీసులకు ప్రత్యక్షంగా వెళ్లడం అనే ఫార్మాట్ నుంచి వర్చువల్, ఆన్‌లైన్ అనే విధానంలోకి మారిపోయింది. కోవిడ్ ఇప్పుడు అంతగా ఇబ్బంది పెట్టకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కొనసాగుతోంది. పాఠశాలలు రెగ్యులర్‌గా నడుస్తున్నా.. అత్యవసర సమయాల్లో ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తూనే ఉన్నారు. విద్యారంగంలో ఇప్పటి వరకు పాఠాల బోధన, పరీక్షల నిర్వహణ వరకే పరిమితం అయిన ఆన్‌లైన్ వ్యవస్థ ఇకపై ఇవాల్యుయేషన్ (మూల్యాంకనం/పేపర్లు దిద్దడం) వరకు వచ్చింది.
తెలంగాణలో ఇకపై పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఆన్‌లైన్ పద్దతిలో చేపట్టేందుకు రంగం సిద్దమవుతోంది. మూల్యాంకనం ఆన్‌లైన్ పద్దతిలో చేయడానికి కాలేజీల లెక్చరర్లు, ఇతర సిబ్బంది సుముఖంగానే ఉన్నారు. అయితే, అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ-వాల్యుయేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై లెక్చరర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ-వాల్యుయేషన్ వల్ల ఖర్చెంత? తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏడాది ఇంటర్ విద్యార్థుల పరీక్ష పేపర్లు దిద్దడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నది. అయితే, విద్యార్థుల నుంచి ప్రతీ ఏడాది పరీక్ష ఫీజు రూపంలో రూ. 500 వరకు ఇందు కోసమే వసూలు చేస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్‌కు అయ్యే ఖర్చులు దాదాపు కవర్ అవుతున్నాయి. ఇంటర్ బోర్డు కూడా తమ నిధుల నుంచి రిజల్ట్స్ ఇతర పనుల కోసం అదనంగా ఖర్చు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మంజూరు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ-వాల్యుయేషన్ కోసం అదనంగా ప్రతీ విద్యార్థికి మరో రూ. 300 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.