గత నెల రోజులుగా చైనా విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్ (57) కనిపించటం లేదు. అనారోగ్యం అంటూ చెబుతున్నా అమెరికా పౌరసత్వమున్న చైనా జర్నలిస్టుతో వివాహేతర సంబంధమే ఆయన మాయమవటానికి కారణమని టాక్. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చిన్‌గాంగ్ అత్యంత సన్నిహితుడు. జూన్ 25న చివరిసారిగా రష్యా ఉప విదేశాంగమంత్రి ఆండ్రీ రుడెంకోతో భేటీలో ఆయన కనిపించారు. ఆ తర్వాత అనేక కీలక సమావేశాలు ఆయన లేకుండానే సాగిపోతున్నాయి. లేదా వాయిదా పడుతున్నాయి. అమెరికా ఆర్థిక మంత్రి, పర్యావరణ మంత్రుల బీజింగ్ పర్యటనలు చిన్‌గాంగ్ లేకుండానే ముగిశాయి.
టీవీ జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర బంధమే చిన్‌గాంగ్ కనిపించకుండా పోవటానికి కారణమని వినిపిస్తోంది. 2022 మార్చిలో ఆమె చిన్‌గాంగ్‌నూ ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ కూడా. ఫు చైనాలో పుట్టినా అమెరికా పౌరురాలు. చిన్‌గాంగ్ ద్వారా ఈమెకు ఒక కుమారుడు జన్మించినట్లు అనుమానిస్తున్నారు. ఫు, ఆమె కుమారుడు కూడా కొద్దికాలంగా కనిపించటం లేదు. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతించదు. ఇలా పార్టీకి విరుద్ధంగా వ్యవహరించిన వారు చైనాలో మాయమవుతుండటం సహజం! చిన్‌గాంగ్ కనిపించకపోవటంపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి పెదవి విప్పటం లేదు. ఈ క్రమంలో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ మాయమవ్వడానికి కారణమై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్.