అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. డెమోక్రాటిక్, రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్రరాజ్య రాజకీయం రంజుగా మారుతోంది. తాజాగా షికాగోలోని డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో కమలా హారిస్ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఆమె నా గురించే మాట్లాడుతోందా..?’ అంటూ సెటైర్లు వేశారు.
‘‘ఆమె చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారు, థాంక్యూలు చాలా వేగంగా చెప్పారు. ఇక ఇప్పుడు చెబుతున్న పాలసీ ప్రతిపాదనలను ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పుడే ఎందుకు చేపట్టలేదు. ఆమె ప్రాజెక్టు 2025 గురించి మరోసారి అబద్ధాలు ఆడుతున్నారు. ఆమెకు ఆ విషయం బాగా తెలుసు. వాటితో నాకేమాత్రం సంబంధం లేదు’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కామ్రేడ్ కమలా హారిస్ హయాంలో ఎలాంటి పురోగతి ఉండదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇక ఆ సదస్సుకు హంటర్ బైడెన్ రాలేదా అని ట్రంప్ ప్రశ్నించారు.