అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ పార్టీ తాజాగా జాతీయ సదస్సు నిర్వహించింది. బుధవారం రాత్రి జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఇందులో ‘మీ అందరికీ తెలియని ట్రంప్ గురించి చెబుతానంటూ మాజీ అధ్యక్షుడితో తన అనుబంధాన్ని పంచుకుంది ట్రంప్ మనవరాలు కై మాడిసన్.
తాతయ్య గురించి గర్వంగా ప్రసంగిస్తూ.. ‘‘మీడియాలో మా తాతయ్యను భిన్నమైన వ్యక్తిగా చూపిస్తారు. కానీ, ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు. మీరు చూడని ట్రంప్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. స్కూల్లో మేమిద్దరం కలిసి గోల్ఫ్ ఆడేటప్పుడు.. మా తాతయ్య నన్ను సరదాగా ఓడించాలని ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ‘నేనూ ట్రంప్‌నే’ అని ఆయనకు గుర్తుచేస్తుంటా’’ అని కై చెప్పింది. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్పందిస్తూ.. ట్రంప్ను చాలా మంది ఇబ్బందులకు గురిచేస్తున్నా.. వాటికి ధైర్యంగా ఆయన ఎదురునిలబడ్డారని కై మాడిసన్ వ్యాఖ్యానించింది.