ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ఇంకా భీకరంగా సాగుతూనే ఉంది. అయితే మొన్నటిదాక ఉక్రెయిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డ రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో కౌంటర్ అటాక్ చేస్తోంది. మాస్కోపై వరుస డ్రోన్ దాడులతో రష్యాను భయపెడుతోంది. యుద్ధంతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్‌కు తాజాగా స్పేస్ ఎక్స్ యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. తమకు అత్యవసరంగా స్టార్ లింక్ సేవలను అందించాలని ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు.
‘‘ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ యాక్టివేట్ చేయలేదు.. అంతే కానీ వేటిని స్పేస్ ఎక్స్ డీయాక్టివేట్ చేయలేదు’’ అని ఎలాన్ మస్క్ తెలిపారు. అత్యవసరంగా సెవస్తపోల్ వద్ద స్టార్ లింక్‌ను యాక్టివేట్ చేయాలని ఉక్రెయిన్ నుంచి అభ్యర్థన వచ్చిందని అంగీకరించారు. వారు అక్కడ ఉన్న రష్యా నౌకలను ముంచాలనే ఉద్దేశంతోనే అడిగారని వెల్లడించారు. ఒక వేళ తాను అంగీకరిస్తే.. స్టార్ లింక్ ఓ పెద్ద యుద్ధ కవ్వింపు చర్యకు స్పష్టంగా సహకరించినట్లవుతుందని ఎలాన్ మస్క్ అన్నారు.