పాలస్తీనా అణిచివేతపై యూఎన్ చీఫ్ వ్యాఖ్యలు దుమారం.. రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్

-

ఇజ్రాయెల్-హమాస్ దాడులు భీకరంగా సాగుతున్నాయి. అటు ఇజ్రాయెల్​లో ఇటు గాజాలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం 48 గంటల్లో గాజాలో 200కు పైగా మంది మృతి చెందారంటే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇరు దేశాల యుద్ధంపై ఐరాస చీఫ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాను 56 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ అణచివేస్తోందంటూ యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఇజ్రాయెల్‌ చేసే సెటిల్‌మెంట్లు, హింసతో పాలస్తీనీయులు తమ సొంత భూమిని కోల్పోయారని ఐరాస చీఫ్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారనీ తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ.. పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని అన్నారు. హమాస్‌ దాడుల పేరిట పాలస్తీనీయులను శిక్షించడం సరైనది కాదని.. 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని గుటెరస్ స్పష్టం చేశారు.

ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఐరాస చీఫ్‌గా గుటెరస్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. హమాస్‌ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాస సెక్రటరీజనరల్‌గా ఉండేందుకు అర్హుడు కాదని ఇజ్రాయెల్‌ రాయబారి గిలాడ్‌ ఎర్డాన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version