ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ మంచి పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలో ఇక మోదీ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. ఆయనకింతటి ప్రజాదరణ ఎలా సాధ్యమైంది? అనే అంశంపై మోదీ అమెరికా పర్యటన వేళ అక్కడి వార్తా సంస్థ ‘ద న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ ప్రజాదరణకు గల ప్రధాన కారణాన్ని కనిపెట్టింది.
ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో షో ‘మన్‌కీ బాత్’ పాత్ర కీలకమని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ‘మన్‌కీ బాత్.. నరేంద్ర మోదీ రెండు గొప్ప బలాలను మిళితం చేస్తోంది. ఒకటి దేశంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులపై లోతైన అవగాహన. రెండోది.. డిజిటల్ మీడియా రంగంలో ఒక విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో ఆయనకున్న వాక్చాతుర్యం. ఏ విషయాన్నైనా శ్రోతలకు ఆయన సమర్థంగా వివరించగలరు. ఏ సందేశాన్నైనా చివరి వ్యక్తి వరకూ చేర్చగలరు. ఆయన పార్టీ బీజేపీకి ఉన్న అపారమైన సోషల్ మీడియా నెట్‌వర్క్ దీనికి సహకరిస్తోంది’ అని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది.