అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. నెక్స్ట్ ప్రెసిడెెంట్ క్యాండిడేట్ ఆమేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా కమలా హ్యారిస్కు మద్దతు ప్రకటించారు. ఆయనతోపాటు పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు.
అయితే, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇప్పటివరకు కమలా హారిస్‌కు మద్దతుగా బహిరంగంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. హారిస్ అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ట్రంప్‌పై ఆమె గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు కమలా హారిస్ సమర్థురాలు కాదని ఒబామా భావిస్తున్నారని.. సరిహద్దులకు ఎప్పుడూ వెళ్లని ఆమె వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారని మీడియా కథనాలు పేర్కొన్నారు. సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పనే అని ఆయన అనుకుంటున్నారని తెలిపాయి.