హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకర సమయంలో ఇరాన్ కు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
‘‘ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్ – ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు కలిసి నిర్మించాయి. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్‌లో రైసీ ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ, ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రైసీతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం చెందారు.