ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే.. మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకున్నా.. వస్తున్న సమాచారం ప్రకారం మార్చి 27 నుంచే ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మే 28న ఫైనల్స్ జరిగే అవకాశం ఉంది. గత రెండు సీజన్లను కరోనా బాగా దెబ్బతీసింది. స్వదేశంలో ఐపీఎల్ మజాను ఫ్యాన్స్ కు దూరం చేసింది. గత రెండు సీజన్ల యూఏఈలోనే జరిగాయి. దీంతో ఇండియాలో ఐపీఎల్ జరిగితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో అభిమానులను కూడా స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉంది.
6 స్టేడియంలు వేదికగా.. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అహ్మదాబాద్, పుణె, ముంబై వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాలు ఈ పొట్టి ఫార్మాట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి కొత్తగా ఐపీఎల్ లో మరో రెండు జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో లక్నో, గుజరాత్ జట్లతో పాటు.. మొత్తం 10 టీంలు టోర్నీలో పాల్గొననున్నాయి.