కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. అత్యంత ప్రమాదకరంగా కరోవా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై కరోనా అధికంగా ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకం అయింది. అయితే మీ శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉందా, లేదా ? అనే దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
ఇంట్లో మిగిలిన సభ్యులకన్నా ఎక్కువగా అనారోగ్యాలకి గురవుతున్నా, జలుబు, దద్దుర్లు వంటి సమస్యలు నిరంతరం వస్తున్నా మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు వాతావరణం మారినప్పుడల్లా సమస్యగా ఉంటుంది. ఇక ఏదైనా తినడం, తాగిన వెంటనే మీకు ఇన్ఫెక్షన్ వస్తే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్లు తెలుసుకోవాలి.
అలాగే కళ్ల కింద నల్లని వలయాలు, ఉదయం లేవగానే తాజాగా అనిపించకపోవడం, రోజంతా శక్తి లేనట్లుగా ఉండడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం, చిరాకుగా అనిపిస్తుండడం, చిన్న పనికే బాగా అలసిపోయినట్లు అవడం.. వంటివన్నీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పేందుకు లక్షణాలు. ఇవి గనక ఉంటే ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిందే.
ఇక మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటే మందులు లేకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు స్వయంగా నయమవుతాయి. రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వైరస్‌తో పోరాడటానికి ఉపయోగపడటమే కాకుండా దాదాపు ప్రతి రకమైన వ్యాధి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి ఉంటే గాయాలు త్వరగా మానుతాయి. అలాగే జలుబు, దగ్గు అంతగా ప్రభావాన్ని చూపించవు.
నారింజ, నిమ్మకాయలలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో పెరుగు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో విటమిన్ డి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బ్రోకలీలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కివిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.