ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో వైసీపీ ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని పవన్ విమర్శించారు.
అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….”సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలు.. తెగించి పోరాడాలి. 1960లో బామిని మండలంలో జగన్ లాంటి దోపిడీదారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది అని అన్నారు. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్‌కు చెప్పండి. గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది అని తెలిపారు. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరబడాలి అని పిలుపునిచ్చారు. పాలకొండలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటాం” అని పవన్ హామీ ఇచ్చారు.