బీజేపీలో ఓ కల్చర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆకర్శించేలా చేస్తుంది. అదే..కష్టకాలంలో..పార్టీ అధికారంలో లేకున్నా.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని ఏదో ఒకరీతిలో గౌరవించడం. మనమెప్పుడైనా అనుకున్నామా..? ఊహించామా..? విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ అవుతారని? మిజోరం గవర్నర్ గా కంబంపాటి హరిబాబు నియమితులవుతారని? అంతెందుకు ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలిపించుకోలేని బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా వ్యవహరించిన తమిళిసై తెలంగాణ గవర్నర్ గా వస్తారని? ఇదే బీజేపీ విశిష్టత. పార్టీకి సేవలు అందించినందుకు బహుమానంగానే బండారు దత్తాత్రేయకు రెండోసారి కూడా గవర్నర్ పీఠం దక్కింది. మరి ఇలాంటి నియామకాలను కాంగ్రెస్ లో ఊహించగలమా? ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మెరుపులను చూశామా. గుర్తింపులు లభించాయా? లాబీయింగ్ చేసుకున్న వారికే పదవులు దక్కేవి. పార్టీ కోసం నిజాయితీగా పని చేసినవారికి పదవులు దక్కినా అది అరుదే.
కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా తెలంగాణలో ఓ నియామకం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీవర్గాలే విస్మయ పడేలా అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంది. అదే..సీనియర్ నేత జానారెడ్డిని పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా నియమించడమే. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో ఆయన అనుభవం, సలహా సూచనలను ఉపయోగించుకునేందుకు ఈ పదవి కట్టబెట్టినట్టినా.. క్రియాశీల రాజకీయాలకు ఆమడ దూరంలో ఉన్న నేతను ఎంపిక చేయడమే విశేషం.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జానారెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. గాంధీభవన్ కు వచ్చిన సందర్భాలు తక్కువే. అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కానీ..వచ్చే ఎన్నికలు పార్టీకి చావోరేవో అన్న పరిస్థితి ఉంది. ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డేందుకు రేవంత్ నాయకత్వంలో పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో చేరికలకు సంబంధించి వివిధ సమస్యలు రావడంతో ఈ కమిటీని నియమించినా.. దీనికి కొద్దికాలంగా సైలెంట్ గా ఉంటున్న నేతకు పదవి అప్పగించడమే విశేషం.
ఈ కమిటీలో సభ్యులుగా రేవంత్, ఉత్తమ్, భట్టి, దామోదర, పొన్నాలను సభ్యులుగా నియమించినా వీరిలో మొదటి ఇద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. దామోదర అయితే కొద్దికాలంగా అసలే కనిపించడం లేదు.వీరిని కమిటీ సభ్యులుగా నియమించి వారితో పార్టీలో మరింత యాక్టివ్ చేయాలన్నది అధిష్ఠానం ఉద్దేశం కావొచ్చు. ఏమైనా పాత కాపులను..ముఖ్యంగా రాజకీయ యవనిక నుంచి దూరంగా ఉన్న నేతలను కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవడమే పెద్ద విశేషం. ఈ కమిటీ నియామకంతోనైనా పార్టీలో చేరికలు సజావుగా జరుగుతాయేమో చూద్దాం.