జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు మచిలీపట్నంలో వారాహి విజయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనెందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే… నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాలకు ఆంధ్రులందరూ బాధపడ్డారు. ఇందులో ఆంధ్రులకు ఎక్కడా సంబంధం లేదు.. కానీ చెడ్డపేరు ఆంధ్రులకు వచ్చింది. ఆంధ్ర నాయకులు చేసిన తప్పుకు ఆంధ్ర జాతి మొత్తం దెబ్బతింది. ఇవాళ రాష్ట్రాన్ని కోల్పోయాం. రాజధాని లేదు… కంచె లేని చేనులాగా రాజధాని లేని రాష్ట్రమైపోయింది. మూడు రాజధానులు అని చెప్పుకుంటామా? నేనెప్పుడూ లక్షలాదిమంది నా వెంట ఉన్నారని గొడవపెట్టుకోను… నేను దమ్ము ధైర్యంతో నిలబడగలనా అనేది ఆలోచించి గొడవపెట్టుకుంటా. ఆనాడు నేను రాజధానికి 30 వేల ఎకరాలు ఎందుకని అన్నాను. హైదరాబాద్ మహానగరం కూడా రాత్రికి రాత్రి అభివృద్ధి జరగలేదు. ఇప్పటిదాకా కూడా మనం రాజధాని ఏదన్నది తేల్చుకోలేకపోయాం.
కులాలను దృష్టిలో పెట్టుకుంటే ఇంతే. వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వరని అంటుంటారు. నాకేమీ వైసీపీ అంటే వ్యక్తిగత ద్వేషం లేదు. జగన్ అనే వ్యక్తిని హైదరాబాదులో ఉన్నప్పటి నుంచి చూసినవాడ్ని. అతనికి నేనెవరో తెలియకపోవచ్చు. అతడు టీనేజిలో ఉన్నప్పటినుంచి గమనిస్తున్నాను. అతడి ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉండేవాళ్లది దూకుడు స్వభావం. దాడి చేయగలిగే మనుషులు వాళ్లందరూ. కడపలో ఒక ఎస్సైని లాకప్ సెల్ లో వేసిన వ్యక్తులు వీళ్లు. ఇవన్నీ చూశాను నేను. ఇలాంటి వాళ్ల భూదందాల వల్ల కూడా విసిగిపోయి తెలంగాణ వాదానికి అనుకూలంగా పరిస్థితులు దారితీశాయి. ఇవన్నీ చూసి, రాష్ట్రానికి ఇతడు తగిన వ్యక్తి కాడని వేరే పార్టీలకు మద్దతు ఇచ్చాను. ప్రైవేటు సైన్యం వేసుకుని వచ్చి అందరినీ అణగదొక్కేస్తాం అంటే మొదటి గళం నాదే లేస్తుంది. నా దేశంలో నేనెందుకు భయపడాలి… అనేది చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన. నాలాంటి కోట్లాది మంది కోసమే పార్టీ స్థాపించాను. వారికి అండగా ఉండడం కోసమే జనసేన ఆవిర్భవించింది.’ అని పవన్ వ్యాఖ్యానించారు.