పొత్తుల విషయమై ఎటువంటి క్లారిఫికేషన్ రావడం లేదు. అటు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ ఓ అస్పష్ట ధోరణి ఉండనే ఉంది. వాటిపై క్లారిటీ లేకుండానే ఇరు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకుని సోషల్ మీడియాలో పోస్టులు రాసుకుంటున్నారు. ఇవి పైకి ఎలా ఉన్నా లోలోపల కార్యకర్తల అంతర్మథనానికి అర్థం వచ్చేవిధంగా, అద్దంపట్టే విధంగానే ఉన్నాయి. దీంతో పొత్తులకు సంబంధించి మరికొంత ప్రతిష్టంభన నెలకొని ఉంది.
మరోవైపు బీజేపీ తో పవన్ దోస్తీపై కూడా క్లారిటీ లేదు. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ పేరును ప్రతిపాదించేందుకు బీజేపీ సిద్ధంగా లేదనే తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాతే తమ పార్టీ ఇంటర్నల్ రూల్ ప్రకారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అంటోంది. ఈ దశలో ఎవరెటు అన్నది తేలడం లేదు. ఎవరు ఎటు ఉన్నా కూడా ఓ స్పష్టతతో కూడినా రాజకీయ దృక్పథంతో పనిచేస్తే మేలు.
2014లో తమ దగ్గరకు వచ్చి పొత్తు విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి చర్చించి వెళ్లారని, అదేవిధంగా ఆరోజు తామెంతో సాయం చేశామని, కానీ ఈ సారి తాము త్యాగాలకు సిద్ధంగా లేమని జనసేన అంటోంది. అందుకే నిన్నటి వరకూ టీడీపీ కూడా జనసేన విషయమై ఎటువంటి నెగిటివ్ కామెంట్ ను చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి పొత్తు కుదిరితే సీట్ల త్యాగం చేయక తప్పదని కూడా తేలిపోయింది. అందుకు టీడీపీ సిద్ధంగా ఉందో లేదో అన్న విషయమై ప్రతిష్టంభన నెలకొంది. పొత్తుల లెక్క తేలకున్నా లేదా తేలిపోయినా ఎవరి పని వారు చేసుకోవాలని బీజేపీ స్పష్టమైన విధానంతో పోతోంది.
అదేవిధంగా బీజేపీ బాటలోనే టీడీపీ కానీ జనసేన కానీ ప్రజా సమస్యలపై దృష్టి సారించి పనిచేస్తే ఆ రెండు పార్టీలూ క్షేత్ర స్థాయిలో బలపడడం ఖాయం. అటుపై ఎన్నికలకు వేర్వేరుగా వెళ్లినా కలిసి వెళ్లినా అంతకుమునుపే ప్రజా సమస్యల పై పోరు చేయడంలో ఎవరు ఏంటన్నది ఏదో ఒక విధంగా తేలిపోతుంది. ఒకవేళ టీడీపీ, జేఎస్పీ ఎదురెదురుగా పోటీ పడినా కూడా అప్పుడు కూడా ఎవరి సత్తా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయిపోతుంది. కనుక పొత్తుల విషయమై వీలున్నంత వేగంగా క్లారిఫికేషన్-కు రావడం, వచ్చేక వీలున్నంత ఉమ్మడి కార్యాచరణతో పనిచేయడం ఇప్పుడిక ఆవశ్యకం.