తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే తాజా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన రూ. 41 లక్షల విలువైన 114 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు, నియోజకవర్గంలో రూ. 3 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు వచ్చేపోయే కరెంటుతో, కరువుకాటకాలతో తెలంగాణ ప్రజలు వలస వెళ్లేవారని, వేసవి కాలంలో తాగునీటి కోసం గ్రామాల్లో ధర్నా చేయని రోజులు ఉండేవి కావన్నారు కడియం శ్రీహరి.
రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంటు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఫిల్టర్ చేసిన తాగునీరును అందిస్తున్న దేశంలోని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు కడియం శ్రీహరి. ఈవిషయంలో కేంద్రమంత్రులే స్వయంగా తెలంగాణను అభినందించారని పేర్కొన్నారు. తెలంగాణలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవడం తప్ప బీజేపి రాష్ర్టానినకి చేసింది ఏమిలేదనీ, దీన్ని ప్రజలందరు గుర్తించాలని అన్నారు కడియం శ్రీహరి.