తెలంగాణల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇప్పటికేటఅభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ ప్రచారం దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను కాలుస్తున్న నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుల పాలైన నేతన్నల కన్నీళ్లు తుడిచే గొప్ప పథకం అది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ మీ ఎమ్మెల్యే కావడం మీరంతా అదృష్టవంతులు అని కేసీఆర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల విషయంలో నాపై పోరాటం చేసి వారికి కావాల్సిన అవసరాలు, మరమగ్గాలను ఆధునీకరించేందుకు డబ్బులతో ఇతర సదుపాయాలు తీసుకొచ్చారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి మార్చి.. ఇవాళ చల్లగా బతికే పరిస్థితి తీసుకొచ్చారు. సోలాపూర్ ఎలా ఉంటదో సిరిసిల్ల అలా కావాలి. మీకు ఒక్క మాట హామీ ఇస్తున్నా. మళ్లీ మనమే గెలవబోతున్నాం. చేనేత కార్మికుల అవసరాలు తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటది.. అని హామీ ఇస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
కొంత మంది దుర్మార్గులు ఉంటారని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేసీఆర్ మండిపడ్డారు. నీచాతీ నీచంగా, రాజకీయం చేసే చిల్లరగాళ్లు ఉంటారు. చేనేత కార్మికులు బతకాలి. మరమగ్గాలు నడవాలి. అవన్నీ జరగాలంటే వారికి పని పుట్టించాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలు అందిస్తోంది. కనీసం కోటి కుటుంబాలకు నిరుపేదలకు బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చాం. ఆ పథకం ద్వారా రూ. 300 కోట్లతో ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతోంది. పేదలకు బట్టలు అందుతున్నాయి. కానీ కొంత మంది దుర్మార్గులు ఆ చీరలను తీసుకుపోయి కాలవెట్టి మాకు ఈ చీరలు ఇస్తారా..? ఆ చీరలు ఇస్తారా..? అని అంటున్నారు. నిన్ను ఎవరు కట్టుకోమన్నారు.. ఎవరైనా బతిమాలిడారా..? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.