సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే మొదట సంతోషపడేది బిజెపి పార్టీనే అని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కానీ కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం చేయడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నేడు మెదక్ పట్టణంలో బిజెపి నియోజకవర్గ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేసి ఈడీ కేసులు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కుమార్తె తెలంగాణలో దోచుకున్నది సరిపోక ఢిల్లీలోను దోచుకోవాలన్న దురాశతో లిక్కర్ స్కామ్ లో వేలు పెట్టిందని విమర్శించారు. లిక్కర్ స్కాం విచారణలో భాగంగానే కవితను చేర్చారు తప్ప ప్రత్యేకంగా ఎవరిపై టార్గెట్ చేయలేదన్నారు. బిజెపి లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావడమే అన్నారు ఎంపీ అరవింద్. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫకీర్ గాళ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయారని అన్నారు. 15 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఉన్న విలువ ఇప్పుడు చూస్తే ఎంత అధ్వానంగా మారిందో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందన్నారు.