తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఎదురు దాడి కొనసాగుతోంది. గురువారం పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఆత్మాభిమానం కంటే కూడా ప్యాకేజీనే ముఖ్యమని నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఉందని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని… ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ”పవన్… నీ చెప్పును జాగ్రత్తగా ఉంచుకో. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో నిన్ను నీవు కొట్టుకో. నీ స్థితికి కారణమైన చంద్రబాబును అదే చెప్పుతో కొట్టు” అని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిగ్గు లేకుండా కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కలిసి నడుస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముందు బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని నాని చురకలంటించారు. పవన్ కళ్యాణ్‌కు కాపు సామాజిక వర్గం, ప్రజలు ముఖ్యం కాదని, కేవలం జగన్‌ను గద్దె దించడమే ప్రధానమని ఆయన మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని కొడాలి నాని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు విశాఖకు పంపారని ఆయన ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై దాడి జరిగిందని నాని అన్నారు. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం పవన్ లక్ష్యమని కొడాలి నాని ఆరోపించారు.