రాష్ట్రవ్యాప్తంగా టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటని పారబోస్తుంటే..జగన్‌రెడ్డి సర్కారు మొద్దునిద్రపోతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. టమోటా రైతులు తమ పంటని రోడ్లపైనే పారబోసి నిరసన తెలిపినా పట్టించుకోని సర్కారు తీరుపై మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే టమోటా అతి ఎక్కువగా పండించే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని, దీంతో రవాణా ఖర్చులకి కూడా వచ్చే అవకాశం లేక పంట పారబోస్తున్నారని తెలిపారు. రైతుకి ప్రస్తుతం కిలో టమోటా రెండు రూపాయలకు మించి పలకడం లేదని, రైతు బజారులో కిలో 16 రూపాయలకి అమ్ముతున్నారన్నారు.
మే నెలలో 15 కిలోల బాక్సు టమోటా ధర గరిష్టంగా 1100 వరకూ పలకడంతో చాలా మంది టమోటా సాగు ఆరంభించారన్నారు. లక్షల రూపాయలు అప్పులుచేసి టమోటా వేస్తే, తీరా పంట చేతికొచ్చే సమయానికి 15 కిలోల బాక్సు 30 రూపాయలకి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం మాత్రం విత్తనం నుంచి విక్రయం దాకా రైతుల్ని ఆదుకుంటున్నామని, దేశానికే ఆర్బీకేలు ఆదర్శం అంటూ సొంత మీడియా సంస్థకి కోట్ల రూపాయలతో ఇస్తున్న ప్రకటనలన్నీ కపట నాటకాలేనని తేలిపోయిందన్నారు. ఎన్నికల హామీగా పంట ఉత్పత్తుల కొనుగోలు సందర్భంగా ధరలు పడిపోతే, ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆదుకుంటుందని, దీని కోసం 3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పిన జగన్‌రెడ్డి గారూ! ఒక్క కిలో టమోటా అయినా, ఒక్క రైతు నుంచి అయినా మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుందా అని ప్రశ్నించారు.
తక్షణమే స్పందించి తీవ్రంగా నష్టపోయిన టమోటా రైతుల్ని ఆదుకునేందుకు ఎకరాకి 50 వేలు పరిహారం ఇవ్వాలని, మరో పంట వేసుకునేందుకు వడ్డీలేని రుణాలు సమకూర్చాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా టమోటా పండించిన రైతులు పంటని చేలో వదిలేయడమో, పారబోయడమో చేస్తుంటే…కనీసం స్పందించనిదా రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే టమోటా రైతులూ బలవన్మరణాలకి పాల్పడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయశాఖ, మార్కెటింగ్, ఇతరవిభాగాలతో సమీక్ష నిర్వహించి టమోటాని మద్దతు ధరకి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.