కొవిడ్ మహమ్మారి కారణంగా జనాల జీవనశైలి మారిందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలు రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. వీటిలో ప్రధానంగా సేవా రంగం, ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగులే అధికమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచం రెండో వేవ్ నుంచి కోలుకుంటోంది. పలు కంపెనీలు తిరిగి తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు వచ్చి పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఎంప్లాయిస్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు. దీంతో చేసేదేమిలేక వివిధ కంపెనీలు కార్యాలయాలకు వచ్చిన ఉద్యోగులకు బంపర్ ఆఫర్లంటూ వారిని అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అందుకోసం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్‌లో కూడా కరోనా సద్దుమణిగింది. కేసులు కూడా పెద్దగా లేవు. దీంతో ఆఫీసులకు రావాలని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు కంపెనీలు.. తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కాకపోతే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రమే రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అక్కడ చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఇంకా ఆసక్తి చూపిస్తూ ఆఫీసులకు వెళ్లడానికి మొండికేస్తున్నారట. దీంతో లండన్‌లోని కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాలు జల్లు కురిపిస్తున్నాయి.
ఆఫీసుకు వచ్చి పని చేస్తే బోలెడు లాభాలు ఉంటాయని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఉద్యోగులు మాత్రం కార్యాలయం అనేసరికి బద్దకిస్తున్నారట. ఇంకొన్ని సంస్థలు ఉచితంగా లంచ్, బార్బిక్ ఉంటుందని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒక కంపెనీ అయితే ఏకంగా బరిస్టానే ఆఫీసులో పెట్టేసింది. ఇలా ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించాలని అక్కడి కంపెనీలు పడరాని పాట్లు పడుతున్నాయట.