కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఉద్యోగాలను వెదుక్కోవడం కష్టంగా మారింది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో 31 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మైకేల్ పేజ్ ఇండియా అనే సంస్థ వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో గత ఏడాది కాలంలో సైబర్ క్రైమ్‌ల సంఖ్య 600 శాతం పెరిగిందని, కనుకనే సైబర్ క్రైమ్‌లు, దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కంపెనీలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం చూస్తున్నాయని తెలిపింది. అందువల్లే ఈ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
మైకేల్ పేజ్ ఇండియా ఇటీవలే ఓ నివేదికను ది హ్యూమన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ పేరిట విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2020 ఫిబ్రవరి నుంచి మే నెలల్లో కేవలం ఆసియాలోనే 1.9 కోట్ల రాన్సమ్‌వేర్, ఫిషింగ్ దాడులు జరిగాయని వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. అందువల్లే ఈ రంగంలో నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రస్తుతం 43 శాతం ఖాళీలు ఉన్నాయని మైకేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులైన వారి కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. అందువల్ల ఈ రంగంలో స్కిల్స్‌ను పెంపొందిచుకుంటే ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు తెలిపారు.