”భారతదేశానికి వచ్చి తిరిగి పర్షియా వెళ్లిన ఒక వ్యాపారి..ఆనవాయితీగా అక్కడి రాజును కలుస్తాడు!
‘భారతదేశం విశేషాలు ఏమిటి’ అని రాజు వ్యాపారిని అడుగుతాడు!
వ్యాపారి తాను చూసిన విశేషాలను చెప్పి- ఒక్కటి మాత్రం ‘మహా విశేషంస అంటాడు!
‘ఏమిటి’ అని రాజు అడిగితే?
‘అది ఒక ఫలం ప్రభూ! దాన్ని వాళ్లు మామిడి పండు అంటారు! అది మాత్రం మహాద్భుతం’ అంటాడు!
‘దాని రుచి ఎలా ఉంటుంది’ అని రాజు అడిగితే
‘ఎలా ఉంటుంది ‘ అని చెప్పినా తక్కువే !
సరిగా అర్థం కాదు ప్రభు!
ఒక మనిషి గడ్డానికి తేనె పూసి చీకితే ఎలా ఉంటుందో- అంతకంటే
మహాద్భుతమైన రుచిగా ఉంటుంది’ అంటాడు!”
ఈ ఉదాహరణ ఒకింత అతిశయోక్తితో కూడుకుని.. మామిడి విశిష్ఠతను మరింత గొప్పగా చెప్పేలా ఉన్నా…. మామిడి పండు రుచి అలాంటిది. వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం. నిజానికి కాయగానూ, పండుగాను మామిడి రాజఫలమే. బాగా పండిన పళ్లను తింటే.. అబ్బో రుచి అమోఘం.
కానీ ఈసారి మాత్రం మామిడి పళ్ల రుచిని ఆస్థాయిలో ఆస్వాదిస్తూ తినలేమోనని అనిపిప్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడి వస్తోంది. కానీ.. ధర మాత్రం చుక్కలు అంటుతున్నాయి. మామూలు రకం మామిడి కిలో ధర ఏకంగా రూ.120 వరకు పలుకుతోంది. రసాలు వంటివి అయితే రూ.150 దాటుతున్నాయి. రూ.50, రూ. 60కి కిలో మామిడి దొరికే రోజులు సుదూరంలోనూ కనిపించడం లేదు.
తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. బంగినపల్లి, తోతాపురి, దశేరి, కేసర్, హిమాయత్, సువర్ణరేఖ. నీలం రకాల మామిడి అధికంగా సాగులో ఉంది. ఏపీ నుంచి కూడా దిగుమతులు ఉంటాయి.
ఈసారి మాత్రం ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక వర్షాలతో దిగుబడి భారీగా తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతికి అనుమతించడంతో మామిడి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అందని ద్రాక్ష పుల్లన అని గాకుండా ‘ధరల మోతతో మామిడి మరింత పుల్లన’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.