తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ గత రెండు రోజులుగా తెలంగాణ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో కలిసి మాణిక్కం ఠాగూర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో.. రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.
కనీసం 70 నుంచి 80 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసే రాహుల్ గాంధీ సభకు సంబంధించిన అంశాలపై చర్చించామని తెలిపారు మాణిక్కం ఠాగూర్. కాంగ్రెస్ పార్టీ మిషన్ తెలంగాణను మొదలు పెట్టిందని.. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్న మాణిక్కం ఠాగూర్.. పార్టీలో చేరినవారందరికీ టికెట్లు ఇస్తామన్న హామీ ఏమీ లేదని.. ఏకాభిప్రాయంతోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. అందరితో కలిసి పని చేస్తామని, ఏ ఒక్కరితోనో పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు మాణిక్కం
ఠాగూర్.