యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో, విమాన ప్రయాణాల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆదేశించింది. మాస్కులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను ఏమాత్రం ఉపేక్షించకుండా విమానాల నుంచి కిందికి దించేయాలని పేర్కొంది డీజీసీఏ . విమానాశ్రయాల్లోనూ కరోనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని డీజీసీఏ తెలిపింది.
ఎయిర్ పోర్టుల్లోనూ, విమానాల్లోనూ మాస్కులు ధరించనివారి పట్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు జారీ చేసింది డీజీసీఏ. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించే అధికారం ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, ప్రత్యేక సందర్భాల్లోనే మాస్కులు తీసేసేందుకు అనుమతి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది.