మృత్యువు ఎప్పుడు, ఏరూపంలో వస్తుందో తెలియదు. ఎంతో ఆనందంగా భారీ వర్షాలతో ప్రాజెక్ట్‌లకు జలకళ సంతరించుకుంది. అయితే ఇలా ఓ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిద్దామనుకున్న ఓ ఇద్దరు మహిళలకు అదే చివరి రోజైంది. లారీ రూపంలో మృత్యువు వచ్చి వారి ప్రాణాలు బలిగోంది. ఈ ఘటన.. ఏపీలోని అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెళుగప్ప మండలం కాల్వపల్లి వద్ద ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
అయితే ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు దానిని వెంబడిం బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకుని డ్రైవర్‌కు దేహశుద్ధిచేశారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను లక్ష్మీదేవి, సరస్వతిగా గుర్తించారు. ఇద్దరు పేరూరు జలాశయాన్ని చూడడానికి వచ్చారని, ప్రాజెక్టును చూస్తుండగా లారీ వారిపైనుంచి వెళ్లిపోయిందని, దీంతో వారి అవయవాలు ఛిద్రమైపోయాయని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.