మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం సమ్మక్క తల్లి వనప్రవేశంతో పాటు సారలమ్మ కన్నెపెల్లికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఈ రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్నారు. ఈ రోజు మేడారానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారానికి వెళ్లనున్నారు. సమక్క-సారలమ్మ తల్లులను దర్శించుకోనున్నారు. గవర్నర్ రాకతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారానికి రావాల్సి ఉన్నా.. ఈకార్యక్రమం వాయిదా పడింది.
16 నుంచి మొదలైన మహాజాతర 19 వరకు జరగనుంది. ఈరోజుతో జాతర ముగియనుంది. ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు తల్లులను దర్శించుకున్నారు. మనరాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాాల నుంచి భక్తులు వచ్చి మేడారాన్ని సందర్శించారు. మారుమూల ప్రాంతంగా ఉన్న మేడారం వారం రోజులుగా మహానగరాన్ని తలపిస్తోంది. నేడు తల్లుల వనప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. దీంతో మళ్లీ రెండేళ్ల వరకు తమ ఆరాధ్య దేవతల కోసం భక్తులు ఎదురుచాడాల్సిందే.