విశాఖపట్నంలో శనివారం ‘విశాఖ గర్జన’ పేరిట కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించనుంది. అయితే.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన జరగాలన్నారు. రేపు జరగబోయే గర్జన అందరి కళ్ళు తెరిపిస్తుందన్నారు. విశాఖను వ్యతిరేకించే వాళ్ళ కళ్ళు తెరిపే విధంగా గర్జన ఉండబోతోందని ఆయన అన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషం అయిన విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావాలనేది కోరిక అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ప్రతీ గడపకు తీసుకుని వెళతామని ఆయన వెల్లడించారు.
జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని, రాజకీయ కారణాలతో విశాఖ క్యాపిటల్‌ను వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దో వ్యతిరేకించేవారు చెప్పాలని ఆయన అన్నారు. అమరావతికి రాజధాని వచ్చినప్పుడు మేము వ్యతిరేకించలేదని, మరి విశాఖకు అవకాశం వస్తే వద్దంటారా? అని ఆయన ప్రశ్నించారు.