ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించి కీలక పాత్రలో నటించిన సినిమా “రైతన్న”. ఈ సినిమాను కేంద్రం లో తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేఖంగా తెరకెక్కించారు. రైతు చట్టాల వల్ల రైతులు ఎదురుకుంటున్న ఇబ్బందులను సినిమాలో చూపించారు. కాగా హనుమకొండ అమృత థియేటర్ లో రైతన్న సినిమా చూసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్ నారాయణమూర్తి వచ్చారు. మంత్రి సినిమా థియేటర్ కు రాగానే సీఎం కేసీఆర్ ఆయనకు ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది.
అర్జంట్ గా హైదరాబాద్ రావాలని చెప్పడంతో సమయం లేక సినిమా పూర్తిగా చూడకుండానే మంత్రి వెళ్లి పోయారు. ఇక ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ….నారాయణమూర్తి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆర్ నారాయణమూర్తికి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.