మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రత్యర్థులపై ఆయా పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ సారి ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలోనే గులాబీ దండు ముఖ్యనేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేశారు. అయితే.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్తాన్ నారాయణపురంలో ఉప ఎన్నికల ప్రచారం, మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, పోలింగ్ బూతుల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు మంత్రి గంగుల.
గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా వాటి పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని శ్రేణులకు సూచించారు మంత్రి గంగుల. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖరారు అయిందని, మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని మంత్రి గంగుల వెల్లడించారు.