బీజేపీ పార్టీ ప్రజల మధ్యన చిచ్చుపెట్టి, విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. భువనగిరి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మన ఉత్పత్తులు- మన గౌరవం విక్రయ కేంద్ర భవనమును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత విద్వేషాల చిచ్చురేపి, పబ్భం గడుపుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది మోడీ, అమిత్ షాలు కాదని ఒకరిద్దరు పెట్టుబడుదారులు మాత్రమేనన్నారు. మధ్య యుగం నాటి సంస్కృతిని తెరమీదకు తెచ్చేందుకు మోదీ,అమిత్ షాల ద్వయం ప్రయత్నం చేస్తుందన్నారు.
మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. పెట్టుబడిదారుల చేతిలో మోదీ,అమిత్ షాలు కీలు బొమ్మల్లా మారారని ఆయన దుయ్యబట్టారు. దేశ సంపదను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు. దేశానికి గొప్ప చైతన్యం కలిగించిన తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం జరిగింది ఈ గడ్డ మీదనే అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ తమ దుర్మార్గపు రాజకీయాలకు పులిస్టాఫ్ పెట్టకపోతే సాయుధ రైతాంగం లాంటి పోరాటం పునరావృతం అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.