వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మా వాడు.. అభిమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ మీద మాకు అభిమానం ఉండదా..?.. పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందని ఆయన అన్నారు. సీఎం.. సీఎం.. అంటూ పవన్ చూసి నినాదాలు చేస్తున్నవారికి పవన్ అన్యాయం చేస్తున్నారని, కాపులు సీఎం కావాలనే కోరిక నాకు లేదన్నారు. పవన్ వెనక తిరిగే వారికి మాత్రమే పవన్ సీఎం కావాలనే కోరిక ఉందని, చంద్రబాబుతో పవన్ పొత్తు అపవిత్ర కలయిక అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. విజయనగరం దేవదాయ శాఖ ఏసీ పరిధి దాటారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పరిధి దాటిన ఏసీపై కచ్చితంగా చర్యలుంటాయని, దేవాలయాల భూములను కాపాడ్డం మా బాధ్యత అన్నారు.
పీఠాధిపతులు.. మఠాధిపతుల సదస్సు నిర్వాహాణకు నిర్ణయించినట్లు, త్వరలో తేదీ ఖరారు చేస్తామన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన అంశంపై సదస్సు అని, రూ. 249 కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వీటిల్లో చాలా వరకు టెండర్లు పిలిచామని, సీజీఎఫ్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. సీజీఎఫ్ నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణపై ప్రతి 15 రోజులకూ సమీక్ష చేపడుతున్నామని, ఆలయాల నుంచి సీజీఎఫ్ నిధులు జమ అవుతున్నాయన్నారు. 13 మందితో ఆగమ సలహాదారుల బోర్డు ఏర్పాటు చేశామని, ఏపీలో బలవంతపు మార్పిళ్లు జరగడం లేదన్నారు. బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయనే అంశం మా దృష్టికి రాలేదని, దేవాదాయ శాఖలో పని చేసే వారిలో దళితులే ఎక్కువ శాతం మందని ఆయన వ్యాఖ్యానించారు.