‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

-

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసని మోడీ వ్యాఖ్యానించగా, బీజేపీ స్టీరింగ్ అదానీ చేతుల్లోకి వెళ్లిపోయిందా? అని కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతుల్లో భద్రంగా ఉందని స్పష్టం చేశారు. ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీయే జరగలేదని మోదీ అంటున్నారని, అంతకుమించి జోక్ ఇంకేమైనా ఉంటుందా అని వ్యాఖ్యానించారు. ఒక కొత్త రాష్ట్రం రెండు పర్యాయాలు రైతు రుణమాఫీకి చర్యలు తీసుకోవడంతో దేశంలో మరెక్కడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులపై మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ కొట్టిపారేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై మోదీ చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలని అన్నారు. “తెలంగాణ ప్రాజెక్టుల్లో చుక్క నీరు కూడా రావడంలేదని మోదీ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు ప్రపంచ సాగునీటి చరిత్రలో గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్ నీటిపారుదల రంగానికి మార్గదర్శకాలు. తెలంగాణలో సాగునీటి విప్లవం కొనసాగుతోంది.

తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరు కూడా మాట్లాడుతున్నారా? ధాన్యాన్ని కొనకపోగా నూకలు తినమన్న కేంద్ర ప్రముఖుల మాటలు తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. పదేళ్లుగా విభజన హామీలపై ఏంచేశారు? ఇప్పుడొచ్చి ఓట్ల కోసం మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా?” అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version