తన వయసు అయిపోతోందనీ.. కళ్లు కనిపించడం లేదంటూ మంత్రి కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ సభలో నవ్వులు పూయించారు. కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఏయే గ్రామాలకు నీళ్లు అందిస్తున్నామో చెబుతూ ఆ లిస్ట్ను చదివారు. కొన్ని గ్రామాల పేర్లు సరిగా పలకలేకపోయారు. దీంతో ఈ మధ్య తనకు కళ్లు కనిపించడం లేదనీ.. వయసైపోయిందని అనడం అక్కడున్న మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, ప్రజలు నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కేసీఆర్‌ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.