Breaking : నేడు మునుగోడుపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష.. వివరాలు ఇవే

-

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు హామీలు గుప్పించారు. ఈ క్రమంలోనే.. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై నేడు మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మునుగోడు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 11 గంటల వరకు మంత్రుల బృందం మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించే సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొననున్నారు.

అభివృద్ధి పథకాలను సమీక్షిస్తూనే ఇంకా చేపట్టాల్సిన పనులపై శాఖల వారీగా రివ్యూ చేయనున్నారు. దాంతోపాటు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపైనా ప్రత్యేకంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో పాలన, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్‌ సమస్యలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర అంశాలు ప్రధాన ఏజెండాగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మున్సిపాలిటీల్లో రోడ్లు, సమీకృత మార్కెట్లు, జంక్షన్లు, పార్కులు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి అంశాలతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా ప్రణాళికలు సిద్ధం చేసేలా సమీక్ష చేపట్టనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version