తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్ముతోందని.. 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో సుమారు 7200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని లేఖలో వివరించారు. నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే లాంటి ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోని హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాన్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటి, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఎస్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లకు గతంలో సుమారు 7200 ఎకరాల భూమి కేటాయించామని కేటీఆర్ తెలిపారు.
ప్రభుత్వ ధర ప్రకారం కనీసం 5 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ ఉంటుందని.. బహిరంగ మార్కెట్లో రూ 40 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలు ప్రారంభించాలని లేదంటే.. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని లేఖలో పేర్కొన్నారు.