తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై సౌందర్ రాజన్ సందేహాలను నివృత్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సబిత ఈ వ్యాఖ్యలు చేశారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను గవర్నర్‌కు వివరిస్తామని తెలిపారు. నిజాం కళాశాల హాస్టల్ వివాదంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. నిజాం కాలేజీలో చదువుతున్న అమ్మాయిలను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తాను అని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
నిజాం కాలేజీకి అనుబంధంగా నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని పీజీ విద్యార్థులకు కేటాయించడంతో యూజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గత నాలుగైదు రోజుల నుంచి యూజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని మంత్రి సబితను కేటీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.