కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఎస్సీ బాలిక ఏడో తరగతి చదువుతోంది. తండ్రి చనిపోయారు. బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన వ్యక్తికి బాలికను ఇచ్చి తల్లి వివాహం జరిపించింది. శారీరకంగా పూర్తిగా ఎదుగుదలలేని స్థితిలో బాలిక గర్భం దాల్చింది.
నెలలు నిండుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పుట్టింటికి చేరుకుంది. పరిస్థితి విషమించడంతో చల్లపల్లి, మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. 15 రోజుల క్రితం గర్భంలోని శిశువు మరణించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఆరోగ్యం దెబ్బతినడంతో బాలిక కన్నుమూసింది. ఆమె మృతదేహానికి కుటుంబసభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు.
గర్భవతి అయిన బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత ఏఎన్ఎంలపై ఉంది. ఎప్పటికప్పుడు తమ పరిధిలోని గర్భిణుల వివరాలను వైద్యారోగ్య శాఖ రికార్డుల్లో నమోదు చేయాలి. బాలికతో పాటు ఆమె కడుపులోని శిశువు మృతి చెందిన విషయాన్ని రికార్డుల్లో చూపాలి. చిన్న వయసులోనే బాలిక గర్భవతి అయిందన్న విషయం తెలిసినా అధికారులకు నివేదించకుండా నిర్లక్ష్యం వహించారు.