హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎంఐఎం తరపున మీర్జా రహమత్ బేగ్‌ను బరిలో దింపుతున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం తరపున మీర్జా రహమత్ బేగ్‌ను బరిలో దింపుతున్నట్లు తన ట్వీట్‌లో ఓవైసీ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న సయీద్ అమీన్ ఉల్ హసన్‌కు ఓవైసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా సయీద్ అమీన్ సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి రహమత్ బేగ్ గతంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జిగా కూడా రహమత్ కొనసాగుతున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనున్నది. 16న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.