ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ, టిడిపిల మధ్య పోరు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరింత రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి వ్యక్తపరిచారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని అన్నారు ఆయన. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని మండిపడ్తారు కోటంరెడ్డి. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని వెల్లడించారు ఆయన.
ఈ నేపధ్యంలో , నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఈరోజు ఆయన టిడిపిలో చేరనున్నారు. తాను టిడిపిలో చేరుతున్నానని.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయానికి వచ్చానని గిరిధర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున తరలు వచ్చి ఆశీర్వదించి, మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను నగరం మొత్తం ఏర్పాటు చేశారు.
నేడు ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. . చంద్రబాబు సమక్షంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత.. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు.. టిడిపి కండువాలు కప్పుకున్నట్లుగా సమాచారం. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరే కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేశారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేసారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి పని చేశారు.