“మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏడాదిన్నర అయింది.. ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు“. “పార్టీ కార్యాలయానికి వెళ్తే.. తాళాలు తీయలేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని అంటున్నారు“. “మా కార్యకర్తలను సొంత పార్టీ నేతలే దూషిస్తున్నారు. వీరికి అడ్డుకట్టవేయలేక పోతున్నాం“- ఇవీ గడిచిన రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ నేతలకు వచ్చిన ఫోన్ల సారాంశం. తాజాగా సీఎం జగన్.. నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. నెల్లూరు జిల్లా నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొన్నాళ్ల కిందట చేసిన విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు.
ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజులుగా జిల్లాల ఇంచార్జ్ మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ఫోన్‌లలోనూ మాట్లాడుతున్నారు. వారి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను కూడా ఆరాతీస్తున్నారు. అయితే, దాదాపు సగానికిపైగా వైఎస్సార్ సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సమస్యల కుప్పలు ఈ సందర్భంగా కదిలాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కో బాధ, ఒక్కొక్క నేతదీ ఒక్కో సమస్య. నియోజకవర్గంలో అధికారులు తమను పట్టించుకోవడం లేదని సాక్షాత్తూ ఎమ్మెల్యేలే చాలా మంది ఫిర్యాదు చేశారు.
ఇక, నేతలు చాలా మంది.. పార్టీలో ఆదిపత్య పెరిగిపోయిందని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారట. మరికొందరు తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, వారిసాయంతోనే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు గుర్రం ఎక్కిందని కూడా చెప్పుకొచ్చారని వైఎస్సార్ సీపీలోనే చర్చ నడుస్తోంది. అయితే, ఆయా సమస్యలను ఓపికగా విన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారట. అయితే, ఇదే సమయంలో కొందరు నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సజ్జల షాక్‌కు గురయ్యారని అంటున్నారు. ఇంచార్జ్ మంత్రులను కలుసుకునేందుకు అవకాశం లభించడం లేదని మరికొందరు ఎమ్మెల్యేలు వాపోయినట్టు సమాచారం. ఇలా ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకున్న సజ్జల వీటి పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఎప్పటికి పరిష్కారం అవుతాయో చూడాలి.