ఆ మాజీ మంత్రికి ఎమ్మెల్సీ కట్టబెట్టింది అందుకేనట

-

దుబ్బాక ఎన్నికల ఫలితం అనుకోని వరమైంది ఆ మాజీ మంత్రికి. పార్టీ ప్రక్షాలన పై గులాబి బాస్ గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పై దృష్టి సారించారు. వరంగల్ నగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకతతో మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు అనుకోని చాన్స్ ల ఎమ్మెల్సీ బంపర్ ఆఫర్ దక్కింది.

తెలంగాణ ఏర్పాటు తరువాత వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు రాజకీయంగా మంచి గుర్తింపు, ప్రాధాన్యం పెరుగుతోంది. మంత్రి పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఇక్కడి నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తు వస్తుంది టిఆర్ఎస్ అధిష్టానం..ప్రతి ఎన్నిక సమయంలో ఉద్యమ నేతలకు ప్రాధాన్యత పెంచుతున్నారు. గతంలోనూ వరంగల్‌ చెందిన ముదిరాజ్‌ వర్గం నాయకుడు బండా ప్రకాశ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, బీసీ వర్గానికి చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు, ఎస్సీ వర్గానికి చెందిన కడియం శ్రీహరి, ఎస్టీల నుంచి సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవకాశం కల్పించారు.

తాజాగా బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వడంతో బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా గ్రేటర్ వరంగల్ తో పాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోను రజక సామాజిక వర్గ ఓట్ల పై గురిపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వరంగల్ తూర్పు,పశ్చిమ నియోజకవర్గాల్లోని ఇద్దరు ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత గ్రేటర్ వరంగల్ ఎన్నికల పై పడకుండా ఉండేందుకు సారయ్యను తెర పైకి తెచ్చారనే చర్చ టిఆర్ఎస్ లో మొదలైంది. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలే కాదు ,పట్టబద్రుల ఎంఎల్‌సీ ఎన్నికలోను దీని ప్రభావం ఉంటుంది అనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు భూదందాలు,సెటిల్ మెంట్లు,ఫైరవీలకు దూరంగా ఉన్న నేతల్లో ఒకరు బస్వరాజు సారయ్య. 2016లో కాంగ్రెస్ పార్టీ నుండి గులాబి గూటికి చేరి ఇప్పటి వరకు పార్టీలో నాలుగేళ్లు ఎలాంటి పదవీ లేకుండా పని చేయడం సారయ్యకు ప్లస్ అయింది. ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే పట్టు బిగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నుండి కొండా దంపతులను ఎదుర్కోవాలంటే తల పండిన సీనియర్ నాయకుడి అవసరం ఎంతైనా ఉంది…బీసీ ఓట్లు ఎక్కువ ఉన్న వరంగల్ గ్రేటర్ లో బస్వరాజు సారయ్య సరైనా వ్యక్తిగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news