కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జన్మదినం సందర్భంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలు ఆయనకు విషెస్ చెప్పారు. ఖర్గే జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకమని కొనియాడారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుధీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోడీ ఎక్స్ పోస్ట్ చేశారు. అలాగే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఎక్స్ పోస్ట్ చేశారు. ‘ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రజల కోసం ఖర్గే చేస్తున్న నిర్విరామ సేవ ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
మల్లికార్జున ఖర్గే 1942 జూలై 21న కర్ణాటకలో జన్మించారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో 2009 నుంచి 2013 వరకు కేంద్ర మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి మంత్రిగా పనిచేశారు. 2013 నుంచి 2014 వరకు రైల్వే మంత్రిగా విధులు నిర్వర్తించారు. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆయన 2021 నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ జాతీయ చీఫ్ గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.