మొగుల‌య్య : ఆ “కోటి” మాటను మ‌రిచారా కేసీఆర్ ?

-

మాట ఇవ్వ‌డం త‌ప్ప‌డం అన్న‌వి త‌ప్పు. మాట ఇచ్చాక ఇష్టపూర్వ‌కంగా హామీ ఇచ్చాక నిల‌బెట్టుకోవ‌డం పాల‌కుల క‌నీస ధ‌ర్మం కావాలి. అలాంటి క‌నీస ధ‌ర్మాన్ని పాటించ‌లేన‌ప్పుడు మాట ఇవ్వ‌డం అన్న‌ది మానుకోవాలి. క‌నీసం ఇచ్చిన మాట కోసం మ‌న నాయ‌కులు ఇప్ప‌టికైనా స్పందిస్తే మొగుల‌య్య లాంటి క‌ళాకారుల‌కు ఆధారం దొరుకుతుంది.ప‌ట్టెడ‌న్నెం దొరుకుతుంది. క్షుద్బాధ తీరుతుంది.
కిన్నెర క‌ళాకారుడు మొగుల‌య్య ప‌ద్మ పుర‌స్కారం ద‌క్కిన ఆనందం ఇప్ప‌టికీ ఏం మిగ‌ల్లేదు. కేంద్రం ఆయ‌న‌కు ప‌ద్మ పుర‌స్కారం ఇచ్చిందేమో కానీ ఆయ‌న జీవితానికి ఏ పాటి భ‌రోసానూ ద‌క్క‌నీయ‌లేదు. దాంతో ఆయ‌న జీవితం క‌ష్టాల న‌డుమే సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం అనుస‌రించి త‌న కుమార్తె కూడా మ‌ర‌ణించింద‌ని మొగుల‌య్య  చెబుతున్నార‌ని తెలుస్తోంది. ఇక ఆ రోజు ఒక కోటి సాయం చేస్తాన‌ని మాట ఇచ్చిన కేసీఆర్ త‌రువాత ఆ సంగ‌తి మ‌రిచిపోయారు. మ‌ళ్లీ మామూలుగానే య‌థావిధిగానే ఆయ‌న పాట‌లు పాడుకుంటూ భిక్షాట‌న చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నార‌న్న సంగ‌తి కూడా ఇక్క‌డ నాయ‌కులు ఎవ్వ‌రూ గుర్తించ‌డం లేదు అని తెలుస్తోంది.

నాగ‌ర్ క‌ర్నూలుకు చెందిన మొగుల‌య్య 12  మెట్ల కిన్నెర వాద్య క‌ళాకారుడు. త‌మ‌ తాతలు, తండ్రుల వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్న అతి కొద్ది మంది క‌ళాకారుల్లో ఆయ‌న ఒక‌డు. ఇంకా చెప్పాలంటే అరుదైన క‌ళాకారుడు. ప‌వ‌న్ కల్యాణ్ ఆయ‌న గురించి తెలుసుకున్నాక, భీమ్లా నాయ‌క్ సినిమాకు పాడే అవ‌కాశం ఇచ్చారు. ఆ రోజు మొగుల‌య్య‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం అందించి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. అటుపై కేంద్రం మొగుల‌య్య‌ను పద్మ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. కానీ అటు పై ఆయ‌న జీవితం మాత్రం దుర్భరంగానే ఉంది. ప‌వన్ క‌న్నా ముందు ఫిల్మ్ రైట‌ర్ పోసాని కూడా ఓ సంద‌ర్భంలో ఆయ‌న‌కు కొంత ఆర్థిక సాయం  చేశారు. ఇక త‌న బాధ‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు కూడా చెప్పుకున్నారు. ఆయ‌న మాత్రం ఏం చేస్తారు.. గోడు విని బువ్వ పెట్టి పంపార‌ని మొగుల‌య్య చెబుతున్నారు. ఇప్పుడు మొగుల‌య్య‌కు ఇల్లు కావాలి..ఆస‌రా కావాలి.. ఆక‌లి తీర్చే వాళ్లే కావాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version