మార్నింగ్ రాగా : అన్ని స్నేహాలూ..విషాదాంతాలు

-

చ‌దువే కానీ భారం
జ్ఞాప‌కమే కానీ చేదు
బ‌డి నుంచి రూల్ బుక్  
నాన్న నుంచి క్ర‌మ శిక్ష‌ణ
మ‌ళ్లీ అందుకుంటే బాగుండు
అమ్మ‌కు ప్రేమ పూర్వ‌క వంద‌నం
మ‌ళ్లీ చెబుతాను..
అమ్మ లాంటి టీచ‌ర్ల‌కు
ల‌వ్ యూ మా అని అంటాను

పాత స్నేహితుల్లో ఎవ్వ‌రు ఎలా ఉన్నారో తెలియ‌దు.తెలుసుకునే ప్రయ‌త్నం చేయ‌కూడదు గాక చేయ‌కూడ‌దు.ఊళ్లో ఒక్క‌డే వ్య‌వ‌సాయం చేస్తున్నాడు.పాత ప‌ద్ధ‌తుల్లోనో,కొత్త విధానంలోనో ఒక్క‌డే..ఆ..దారిలో ఉన్నాడు.కాలం ఇచ్చిన కానుక వాడొక్క‌డే..!మిగ‌తావాళ్ల‌లో దేశాన్ని బాగు చేసే ఉద్యోగాలు ఎవ్వ‌రివీ కావు.జీవితాన్ని సంస్క‌రించే ఉద్యోగాలు కూడా ఎవ్వ‌రివీ కావు.
కొన్ని ఫొటోలు, కొన్ని న‌వ్వులు అత్యంత విరుద్ధం,అన‌వ‌స‌రం అని అనిపించాక ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టు గెద‌ర్ నిన్న‌టి వేళ (మార్చి 6,2022) ముగిసింది.

అసంద‌ర్భ స‌హిత వాక్యం అస్స‌లు వెల్ల‌డి చేయ‌కూడ‌దు అని అంటారే! న‌వ్వుకున్నాను నేను.ఏ వాక్యంలో  అయినా తీపి అధిగ‌మిస్తోంది. చేదు అవ‌ధిగా మారి ఉంది. మ‌నుషులు క‌దా ! ఇంత‌వ‌ర‌కూ ఉన్న తోడు ఇది వ‌ర‌కు నీడ ఇవ‌న్నీ త‌లుచుకుని సంతృప్తంలో ఉంటారు.దీనిని సంతృప్త స్థానం వెత‌క‌డం అని కూడా అనాలి.ఊళ్లోఇందిర టీచ‌ర్.. ఊళ్లో సుశీల టీచ‌ర్ ..ఊళ్లో గౌరీ టీచ‌ర్..వీళ్లంటే నాకెంతో ఇష్టం. తండ్రి స్థానంలో ఉండి హితవు చెప్పే భాస్క‌ర‌భ‌ట్ల స‌ర్ అంటే ఇష్టం.మిగిలిన వారు కూడా కాస్త ఇష్టం. అన్నివేళ‌లా నేను చ‌దువులో రాణించ‌లేక‌పోయిన సంద‌ర్భాలే నాకెంతో ఇష్టం.ఆ వేళల్లో న‌న్నెంతో  ప్రోత్స‌హించిన మీరా టీచ‌ర్ (అమ్మ‌) అంటే ఎంతో ఇష్టం. నా పై ఏ అంచనాలూ పెట్టుకోని రామ‌లింగం మాస్టారు (లెక్క‌లు చెప్పేవారు కానీ నాకు అస్స‌లు అర్థం అయ్యేవి కావు,ప‌ర‌మ ద‌రిద్ర‌గొట్టు క్లాస్ అదొక్క‌టే) కాల‌గ‌తిలో వెళ్లిపోయారు. పాపం ! ఆయ‌న అంచ‌నా..నేను ప‌ది త‌ప్పుతాన‌ని..న‌వ్వుకున్నా ను నేను. ఆ విధంగా నేను ఇప్పుడు ఏ గ‌తి త‌ప్ప‌కుండా ఉన్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. గ‌తియై కాచు వాడెవ్వ‌డు అని ప్ర‌శ్నిస్తూ పోతున్నాను.

చ‌దువంటే అస్స‌లు ఇష్టం లేదు..అని ఎన్ని సార్లు అనుకుంటానో అన్ని సార్లు ప్రేమ పెంచుకునే ప్ర‌య‌త్నం చేశాను.ఆ విధంగా మ‌ళ్లీ చ‌ల్దులార‌గించుట(పోత‌న ర‌చ‌న‌) అన్న పాఠం చ‌దివేను. పోత‌న ప‌ద్యం చెప్పిన టీచ‌ర్ కూడా లేరు అనుకుంటాను.గుర్తు లేదు. నాకెంతో ఇష్టం అయిన చీమ‌త‌ల్లి విశ్వాసం అన్న‌పాఠం గురించి మాత్రం బాగా వివరించి ఇప్పుడు చెప్ప‌గ‌ల‌ను.ఎంత ఆనంద‌మో! ఆ పాఠం రాసిన రావూరి భ‌ర‌ద్వాజ (జ్ఞాన పీఠ్ అవార్డు గ్ర‌హీత‌) నా స్నేహితులు. ఇలా అంటే గోర‌టి వెంక‌న్న ఈర్ష్య చెందాడు. న‌వ్వుకున్నాను. జ్వాలా ముఖి నా స్నేహితుడు అంటే అసూయ చెందాడు. న‌వ్వుకున్నాను.గోర‌టి లాంటి క‌వులు ఇవాళ ప‌ద‌వుల వెంట..నేను క‌విని ప్ర‌జ‌ల వెంట…ఆహా!

ఆయ‌నే ఒప్పుకున్నాడు మా వ‌య‌స్సు అయిపోయింది ఇక మాట్లాడే శ‌క్తి త‌గ్గిపోతోంది అని ! మ‌రి ! నా వ‌య‌స్సు ఏమౌతుందో ! య‌వ్వ‌న ప్రాయాల‌ను వాక్యాల‌కు అందించి పోయి,వెన్నెల వాకిట్లో బాల్యం వెతుక్కునే ఆనందం నాదే క‌దా !

ఆనందించాలి నేను ..ఆనందించాలి మీరు.

మ‌ళ్లీ నిన్న‌టి కార్య‌క్ర‌మం
మ‌ళ్లీ నిన్న‌టి కాల వ‌ర్ఛ‌స్సు
లేదా మ‌రోతీపి ఇంకో చేదు

ఊరి కోసం  కాకున్నా  నా కోసం నేను చాలా మంది ద‌గ్గ‌ర చేరువ.నా కోసం  చేరువ అయినాక ఊరి కోసం ఆలోచిస్తున్నాను వారితో ..ఆ విధంగా శాక్సోఫోన్ ఆర్టిస్టు స్వ‌ప్న శ్రీ‌ను వ‌చ్చారు..వారిని అనుస‌రిస్తూ డోలు.అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం దారుల నుంచి
రేలా రే రేలా జాన‌కీ వ‌చ్చాడు.మంచి పాట‌లు 13 పాడించాలి అని అనుకున్నాను. నిన్న‌టి ఫంక్ష‌న్లో..కానీ కుద‌ర‌లేదు.చెప్పాను చైత‌న్య ప్ర‌ధాన పాట‌లే పాడిస్తాను..కానీ రావే మ‌ర‌ద‌లు పిల్లా ఇలాంటి పాట‌లు పాడించే వేదిక ఇది కాదు అని!

ప్రొగ్రాం లోగోను గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి డిజైన్ చేశారు.చేయించాను.అవును ను ము కాదు చేయించాము కాదు చేయించాను.ప్రొగ్రాం టైటిల్ : ఓ మై ఫ్రెండ్..ద‌రిద్ర‌గొట్టు సెల్ఫీలు లేక‌పోతే ప్రొగ్రాం బాగుండేది..ద‌రిద్ర గొట్టు మ‌నుషులు లేక‌పోయినా ప్రొగ్రాం బాగుండేది. ఇంకా బాగా వ‌చ్చి ఉండేది.అవి మిన‌హా స్ప‌ర్థ‌యా వ‌ర్థ‌తే విద్య అని ఎందుకు అనుకోవాలో మ‌రో సారి మ‌న‌సులో అనుకుని లోప‌లి గురువు కాదు లోప‌లి మ‌నిషి చెప్పిన విధమ్మున,రిథ‌మ్మున న‌డుచుకుని ముందుకు పోవ‌డం ఇప్ప‌టి క‌ర్త‌వ్యం.

లోకాస్స‌మస్తా సుఖినో భ‌వంతు..అని ప‌దే పదే పలికిన ఇద్ద‌రు వేద విద్యార్థుల‌కు ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద..న‌చ్చ‌ని స్నేహితుల‌ను ఇక‌పై క‌ల‌వ‌ను..చేదు..క‌నుక దూరం..ఎడం అని రాయాలి. జ‌డ‌త్వం ఆపాదించి పోవాలి.న‌చ్చిన వాళ్ల‌తో ప్ర‌యాణం సౌక‌ర్య‌మో కాదో తెలియ‌దు.తీపి క‌నుక చేరువ..జీవితం దుఃఖం నుంచి దుఃఖం వ‌ర‌కూ అవునో కాదో తెలియ‌దు.నా నుంచి వెళ్లిన అమ్మ‌ను నా నుంచి వెళ్లిన నాన్నను అడిగి రావలె..దేనినీ నిర్థారించ‌రు క‌దా ! మీరు అన్నారెవ‌రో! న‌వ్వేను నేను..మ‌రో సారి వందో సారి..

ప‌ది త‌లల ప‌ర‌మ శివ‌త‌త్వం వెతుకులాట‌లో..అయం శివం..అహం శివం..  


– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

2000 మార్చి బ్యాచ్‌,
శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల,
ప‌దో త‌ర‌గ‌తి పూర్వ విద్యార్థుల క‌ల‌యిక,
సంబంధిత స‌మావేశానికి వెళ్లి వ‌చ్చాక.

స్థ‌లం : మీనా కృష్ణా ప్లాజా – శ్రీ‌కాకుళం

Read more RELATED
Recommended to you

Exit mobile version