అమ్మాయిలు.. తెలిసీ తెలియని వయస్సు నుంచే తమ కలల రాకుమారుడి గురించి కలలు కంటుంటారు. పెరుగుతున్న కొద్దీ వారితో పాటు వారికి కాబోయే వాడి గురించి ఆశలూ పెరుగుతుంటాయి. కానీ ఒక వయస్సొచ్చాక.. లోకం పోకడ తెలిశాక.. చూడకూడని ఘటనలు చూశాక.. వినకూడనివి విన్నాక.. కొందరి జీవితాలు.. మరికొందరి అనుభవాలు తెలిశాక వారు పెళ్లి గురించి కట్టుకున్న కలల సౌధం ఒక్కసారిగా కూలిపోతోంది. ఇక తమ జీవితంలో పెళ్లికి చోటుండకూడదని దృఢ నిశ్చయం తీసుకుంటున్నారు. ఇలా నేటి సమాజంలో చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కంటే.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అని ఇటీవల ప్రభుత్వం చేసిన సర్వేలో వెల్లడైంది.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2019’ ప్రకారం, దేశంలో ఒంటరి పురుషులు కేవలం 1.5 శాతం ఉండగా, ఒంటరి మహిళలు 5.2 శాతం ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు లేదా పెళ్లయి వేరుగా ఉన్నవారు. రాష్ట్రాల ప్రకారం చూస్తే, ఒంటరి మహిళల శాతం కేరళ, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. కేరళలో 9.2 శాతం, తమిళనాడులో 8.9 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 7.6, 7.0 శాతాలుగా నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా ఉన్న పురుషుల సంఖ్య కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది.
మహిళలు ఒంటరిగా ఉండాలనుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. లవ్ మ్యారేజ్ అయినా.. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా స్త్రీలకు ఎన్నో ఆంక్షలు, పరిమితులు ఉండటం వల్లే వాళ్లు వివాహ బంధానికి నో అంటున్నారని తెలిపారు. ఇష్టం లేకపోయినా పిల్లల్ని కనడం, వాళ్ల బాధ్యతలను స్త్రీలు మాత్రమే నెత్తిన వేసుకోవడం, పర్సనల్ స్పేస్ లేకపోవడం వంటి కారణాలతో కొందరు పెళ్లంటే భయపడుతున్నారని చెప్పారు.