అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా.. భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. అయితే పర్యటనలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పాల్గొంటానని ప్రకటించారు. ఇందుకోసం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రైలు మార్గాన ఏపీకి బయలు దేరారు. కానీ మధ్యలోనే రైలు దిగి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే.. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ రాశారు.
పర్యటనకు రాలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు రఘురామకృష్ణ. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణ. ఆహ్వానం లేకపోవడంతో తాను పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్టు పేర్కొన్నారు రఘురామకృష్ణ. మరోవైపు, గత రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భీమవరానికి బయలుదేరినప్పటికీ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. భీమవరంలో తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులపై పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలియడంతో మనస్తాపం చెందిన ఆయన మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లినట్టు ఆయన కార్యాలయం వెల్లడించింది.